కోమటిరెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ… అందరం కలిసికట్టుగా
కాంగ్రెస్ పార్టీ సీనియర్లంతా కలిసి పనిచేయాలని నిర్ణయించామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. హైదరాబాద్లో తన నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి స్వాగతం పలికారు. వారిద్దరూ కాసేపు సమావేశమయ్యారు. పార్టీ అంతర్గత విషయాలతో పాటు భవిష్యత్ ఏం చేయాలనే అంశాలపై ఇరువురు చర్చించారు. పీసీసీ ప్రకటించే అన్ని కార్యక్రమాలకు సహకరిస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. పార్టీలో అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. పీసీసీ సీనియర్ నాయకుల నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ వల్ల రైతులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వారికి అండగా ఉద్యమించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
సీఎం కేసీఆర్ జన్మదినం రోజైనా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, లేదంటే అదే రోజు గాడిదల ముందు కేక్ కట్ చేస్తామని తెలిపారు. తాము పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలతోనే కేసీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ను నమ్మవద్దని సూచించారు. సిద్దిపేట, గజ్వేల్లో ఉన్న వాళ్లే ప్రజలా తన నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూంలు ఎందుకివ్వలేదని కోమటిరెడ్డి నిలదీశారు. భువనగిరి అభివృద్ధికి నిధులు అడిగితే ఇవ్వలేదన్నారు. రేపు రాచకొండ పోలీసు కమిషనరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తానని కోమటిరెడ్డి తెలిపారు.













