కేసీఆర్ ఢిల్లీ పర్యటన… రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీల రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడన్నారు. కల్లాల్లోని ధాన్యం కొనకుండా ఢిల్లీలో యాసంగి పంటపై డ్రామాలు ఎందుకని ప్రశ్నించారు. తడిచిన ధాన్యం కొనే అంశంపై కేసీఆర్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలులో జరుగుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆలసత్వం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి మోసులు వస్తున్నాయన్నారు. యాసంగి ధాన్యం కొనే అంశంలో ఒత్తిడి చేయబోమంటూ కేంద్రానికి కేసీఆర్ ఇచ్చిన లేఖే నేడు వరి రైతుల పాలిట ఉరితాడు అయిందని మండిపడ్డారు. కల్లాల్లోకి కాంగ్రెస్ పర్యటనలో రైతులు తెలిపిన ఆవేదన పైనే మాట్లాడుతున్నానని తెలిపారు.
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాల పరిహారం కోసం న్యాయస్థానాలకు ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిరదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.













