సీఎం కేసీఆర్ కు ఆ రెండూ లేవు : కోదండరామ్
సీఎం కేసీఆర్ తక్షణ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఆలోచిస్తారని, దీర్ఘకాలిక ప్రయోజనాలపై కాదని తెలంగాణ జనసమితి (టీజేసీ) అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ, అంబేడ్కర్ లాంటి వారికి సిద్ధాంతం ఉంది కాబట్టే ఆర్థిక నమూనా తయారు చేశారన్నారు. సీఎం కేసీఆర్కు ఆ రెండు లేవని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే జాతీయ పార్టీ పేరుతో నాటకాలాడుతున్నారని విమర్శించారు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం అధికారాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ జాతీయ పార్టీ విఫల ప్రయోగమని, తెలంగాణ అస్తిత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని ఆక్షేపించారు.
తెలంగాణ అస్తిత్వాన్ని, వాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ మోడల్ డొల్లతనాన్ని బయటపెడతామన్నారు. హైదరాబాద్, ఢిల్లీ లో సదస్సులు పెట్టి బీఆర్ఎస్, తెలంగాణ మోడల్ కుట్రలను బహిర్గతం చేస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నప్పుడు ఆస్తుల పెంచుకునేందుకు సమయం ఎలా దొరికిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన అజెండాతో ముందుకు రావాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీజేఎస్ పోటీ చేస్తుందని కస్పష్టం చేశారు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడితే తెలంగాణ సమాజం ఆయన వెంట ఉంటుందన్నారు. టీజేసీ తరపు తాము కూడా మద్దతిస్తామని తెలిపారు.













