తెలంగాణలో పెరిగిన పులుల జనాభా
తెలంగాణ రాష్ట్రంలో పులుల జనాభా పెరిగినట్లు కనిపిస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్ ).. ఈ అభయారణ్యాల్లోనే కాక కొత్తగా ఏటూరునాగారం, పెద్దపల్లి వంటిచోట్ల పులుల పాదముద్రలు లభించడంతో రాష్ట్రంలో పులుల సంచారం పెరిగినట్లు కనిపిస్తోందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. 30 ఏళ్ల కిందటే ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి పులులు కనిపించకుండాపోగా ఇటీవల ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో వీటి కదలికలు రికార్డయ్యాయి. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్ సమీపంలో మరో పులి కనిపించింది. ఏటూరునాగారంలో కనిపించిన పులే జయశంకర్ భూ పాలపల్లి జిల్లాకు చేరుకుని తాడిచెర్ల, మహాముత్తారం ప్రాంతాలతో పాటు పెద్దపల్లి జిల్లాలోనూ సంచరించినట్టు అటవీ అధికారులు నిర్ధారించారు. కిన్నెరసాని, పాకాల ఇతర అటవీప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు పులులు స్థిరనివాసం ఏర్పర్చుకునేందుకు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు.
పులుల భద్రత, పరి రక్షణతోనే మనుషులు, ఇతర జీవజాలం, పర్యావరణ భవిష్యత్ ఆధారపడి ఉన్నాయని పర్యావరణ నిపుణులు, ప్రక•తి ప్రేమికులు అంటున్నారు. అడవి, పర్యావరణం, ప్రక•తి, జంతుజాలం, గడ్డి భూములు, జీవవైవిధ్యం వంటివన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా పులిపైనే ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 54 పులుల అభయారణ్యాలు ఉండగా, వాటిలో 2 వేల చ.కి.మీ పైబడి అటవీ వైశాల్యమున్న నాలుగైదు అభయారణ్యాలు 3 ఏపీ, తెలంగాణల్లోనే ఉన్నాయి. ఏపీలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) 3,728 చ.కి.మీలలో విస్తరించగా, 60 పులులున్నట్టు ఇటీవలి వెల్లడైంది. తెలంగాణలోని ఏటీఆర్ 2,611 చ.కి. మీలుగా విస్తరించి ఉండగా 20 పులులు, 2,016 చ.కి.మీ విస్తీర్ణం గల కేటీఆర్ పరిధిలో 12 వరకు పులులున్నట్టు అంచనా. ఏదీ ఏమైనా రాష్ట్రంలో పులుల వాతావరణం పెరగడం పట్ల జంతుప్రేమికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.













