ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. త్వరలోనే!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో టీజీవో అధ్యక్షురాలు, ఇతర ఉద్యోగులు కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ విడుదలకు సీఎం కేసీఆర్ సానుకూలం స్పందించారని, వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినట్లు పేర్కొన్నారు.
జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడే ఖాళీలకు, త్వరలోనే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం చెప్పినట్లు తెలిపారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలని సీఎం కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కృషి వల్లనే నిరుద్యోగులకు 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయని తెలిపారు.













