Minister Jupally: ఆ పార్టీకి కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలింది : మంత్రి జూపల్లి
రెండేళ్ల తర్వాత అధికారంలోకి రాగానే తోలు తీస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) చెబుతున్నారని, ఆ పార్టీ కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలి ఉందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. గాంధీభవన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) , వాకిటి శ్రీహరి (Vakiti Srihari)తో కలిసి జూపల్లి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బలహీనపడిరదని, పార్టీ ప్రతిష్ట కాపాడుకోవాలనే విషయం కేసీఆర్‌కు అర్థమైందని చెప్పారు.పాలమూరు ప్రాజెక్టు సమస్య గురించి కాదు, పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ బయటకు వచ్చారు. ఆ ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని పూర్తిచేస్తానని గతంలో ఆయన చెప్పారు. పదేళ్లు పాలించి రూ.8 లక్షల కోట్ల అప్పు చేసినా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన కాలువలు కూడా పూర్తిచేయలేదు. 2023 ఎన్నికల సమయంలో ఒక మోటార్ ఆన్‌చేసి పాలమూరు ప్రాజెక్టు జాతికి అంకితమన్నారు. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా ఆ పని చేశారు అని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికావాలంటే మరో 40- 50 వేల కోట్లు కావాలి. పర్యావరణ అనుమతులు తీసుకుంటే మన నీళ్లు మనం వాడుకునే పరిస్థితి ఉంటుంది. సాగుకు కాదు, తాగునీటి కోసమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పనులు మొదలు పెట్టవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇరు రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీలు అని విభజన చట్టంలో ఉంది. నదీ పరివాహక ప్రాంతం ఉన్నంత మేరకు నీటి కేటాయింపులు జరగాలి. రాష్ట్రానికి 299టీఎంసీలు చాలు, 512 టీఎంసీలు ఏపీ వాడుకోవాలని పదేళ్లు వదిలేశారు అని విమర్శించారు.






