మిషన్ స్పీడ్ 19 ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్

“స్పీడ్” పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ(స్పీడ్) పేరుతో కొత్త కార్యాచరణ రూపొందించింది. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 19ప్రాజెక్టులు, పనులను స్పీడ్ పరిధిలోకి తెచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని స్వయంగా పర్యవేక్షిస్తారు. పనుల తీరు, పురోగతిపై సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలనేది స్పీడ్ ప్రధాన లక్ష్యం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రామాణికమైన మౌలిక సదుపాయాల కల్పనలో వివిధ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులు, అవరోధాలు అధిగమించేందుకు స్పీడ్ ప్రత్యేక చొరవ తీసుకోనుంది. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళిక విభాగం ఆన్ లైన్ పోర్టల్ రూపొందిస్తుంది. ఏ రోజుకు ఎంత పని జరిగిందనే అప్ డేట్ డేటాను అందులో పొందుపరచాలి. ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందనే నిర్ణీత కాల వ్యవధిని ఆయా విభాగాలు ఆన్ పైన్ పోర్టల్లో అప్డేట్ చేయాలి. ఎప్పటివరకు ఏఏ పనులు పూర్తవుతాయనే అంచనాలను సైతం పోర్టల్లో ఉంచాలి. దీని వల్ల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది.