సమ్మక్క- సారక్క జాతర తేదీలు ఖరారు
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన తెలంగాణ కుంభమేళాగా, సమ్మక్క సారలమ్మ మహా జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. రెండేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహా జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో తరలి వస్తారు. కొవిడ్ మొదలైన తర్వాత మొదటిసారి జాతర జరుగుతుండడంతో ఈసారి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులు ముగింపు దశకు చేరుకోగా, ఈ పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లును విడదుల చేసింది.
ఫిబ్రవరి 16న సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెపైకి రానుండగా, 17న చిలకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి చేరుకోనుంది. 18న భక్తులకు అమ్మవార్ల దర్శనం, 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారని పూజారుల సంఘం ప్రకటించింది. జాతరకు సంబంధించిన పనులను ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో చేపడుతుంది. జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో కొందరూ భక్తులు ఇప్పటి నుంచే అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుండడం విశేషం.













