ఘనంగా తెలుగు టైమ్స్ 20వ వార్షికోత్సవ వేడుకలు
తెలుగు టైమ్స్ 20వ వార్షికోత్సవ వేడుకలు తెలుగు టైమ్స్ కార్యాలయంలో మార్చి 20వ తేదీన ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు టైమ్స్ ఎడిటర్, మేనెజింగ్ డైరెక్టర్ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, తెలుగుటైమ్స్ ప్రారంభించడం వెనుక ఉన్న నాటి అనుభవాలను తెలియజేశారు. అమెరికాలో ఉన్న ఇతర గుజరాతీ, తమిళం, హిందీ, పంజాబీ తదితర వాళ్ళకు ఉన్నట్లుగా తెలుగువాళ్ళకు ఓ పత్రిక లేదన్న కొరతను తీర్చాలన్న ఉద్దేశ్యంతో తెలుగుటైమ్స్ పత్రికను 2003లో ప్రారంభించినట్లు చెప్పారు. నాటి నుంచి నేటి వరకు పత్రికను నిరంతరాయంగా తీసుకువచ్చినట్లు తెలిపారు. ఎన్నారైలు, అడ్వర్టైజర్లు, తెలుగు సంఘాల ఆదరాభిమానాలతో తమ 20 సంవత్సరాల ప్రయాణం సాగిందని ఇక ముందు కూడా అందరూ ఆదరించి పత్రికను ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రోత్సహించాలని కోరారు. తెలుగు టైమ్స్ తరపున ఎన్నో కార్యక్రమాలను చేశామని ఈ 20వ వార్షికోత్సవ వేళలో తెలుగు టైమ్స్ బిజినెస్ అవార్డుల వేడుకలను కూడా నిర్వహించనున్నట్లు చెన్నూరి వెంకట సుబ్బారావు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యులు చెన్నూరి రామ్ సుశాంత్, న్యూస్ ఎడిటర్ గోవిందరాజన్, డిజైనర్ సయ్యద్ జాకీర్ హుస్సేన్, వెబ్ అడ్మినిస్ట్రేటర్ సురేష్ బాబు, మార్కెటింగ్ మేనెజర్ ఐ.వి. రావు, సబ్ ఎడిటర్ సైదులు, డిజిటల్, సోషల్ మీడియా హెడ్ భార్గవ కృష్ణ, సినిమా కాలమిస్ట్ రాంబాబు వర్మ, పొలిటికల్ కాలమిస్ట్ సిఎల్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.













