సిభా గ్రూపు యాజమాన్యం ఆధ్వర్యంలో తెలుగుటైమ్స్ 18వ వార్షికోత్సవ సంచిక
అమెరికాలో 2003లో ప్రారంభమైన తెలుగుటైమ్స్ నాటి నుంచి నేటి వరకు పాఠకులకు మీడియాపరంగా తన సేవలను అందిస్తూ వస్తోంది. ప్రింట్ మీడియాతోపాటు వెబ్సైట్ ద్వారా కూడా పాఠకులకు అమెరికాలోని తెలుగు సంఘాలు చేస్తున్న సేవా కార్యక్రమాలను, ఇతర ఎన్నారైల ప్రత్యేక కార్యక్రమాలను, అమెరికా గవర్నమెంట్ భారతీయులకోసం చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పాఠకుల దృష్టికి తీసుకువస్తోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఉన్న పాఠకులకు అందిస్తోంది. జన్మభూమి సేవలో వారిని అనుసంధానం చేస్తోంది.
ప్రతి సంవత్సరం తెలుగు టైమ్స్ వార్షికోత్సవ సమయంలో ఓ ప్రత్యేక శీర్షికను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది ఈ వార్షికోత్సవ సంచికలో ప్రచురించే ప్రత్యేక శీర్షికను మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటోందని చెబుతుంటారు. 13వ వార్షికోత్సవ సంచికలో మాతృభూమి సేవలో 13 మంది ఎన్నారైల పేరుతో, 14వ వార్షికోత్సవ సంచికలో తెలుగువారి సేవలో 14 తెలుగు సంఘాలు, 15వ వార్షికోత్సవ సంచికలో 15 మంది సక్సెస్ఫుల్ ఎంట్రప్రెన్యూర్స్, 16వ వార్షికోత్సవ సంచికలో రెస్టారెంట్ బిజినెస్లో 16మంది తెలుగువాళ్ళు పేరుతో, 17వ వార్షికోత్సవ సంచికలో తెలుగు భాషా సేవలో 17 మంది భాషా ప్రముఖులు పేరుతో ప్రచురించిన కవర్ స్టోరీలకు ప్రత్యేక ప్రశంసలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
సిభా గ్రూపు ఆధ్వర్యంలో తెలుగుటైమ్స్ సరికొత్త హంగులతో, విశేషాలతో పాఠకులను ఆకట్టుకునేలా తయారవుతోంది. తెలుగుటైమ్స్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంచికలో ప్రత్యేక శీర్షిక కింద అసోసియేషన్ల మహిళా నాయకురాళ్ళు కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించాము.













