వేసవిలో వన్యప్రాణుల దాహం తీరుస్తున్న తెలుగు ఎన్నారై!
జయశంకర్ భూపాలపల్లి: వేసవి కాలం వస్తే చాలు ఎండలు మండిపోతుంటాయి. ఇళ్లలో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఎండలో నాలుగడుగులు వేస్తే చాలు దాహం వేసేస్తుంది. ఇలా కేవలం మనుషులకే కాదు, జంతువులకు ఇబ్బందులు ఉంటాయి కదా. అందుకే వేసవి కాలం వస్తే చాలా వన్యప్రాణులు ఎండ తాకిడికి కన్నుమూస్తుంటాయి కూడా. ముఖ్యంగా చిన్న చిన్న కొలనులు ఎండిపోవడంతో వాటికి తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో అటవీ జీవాలు దాహంతో నీటి కోసం ఊళ్లలోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఈ మూగ జీవాల సమస్యను ఓ ఎన్నారై సీరియస్గా తీసుకున్నారు. అమెరికాలో స్థిరపడ్డ ఈ తెలుగు ఎన్నారైకు అడవి ప్రాంతంలోని కోతులు, ఇతర జీవుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. అంతే వెంటనే తన ఆలోచనకు క్రియారూపం ఇచ్చేశారు.
ఇలా మూగజీవాల దాహాన్ని తీర్చుతూ మానవత్వాన్ని చాటుకుంటున్న ఎన్నారై ఎవరో తెలుసా? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం గారెపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై తోట సురేష్. పదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్న ఆయన ఇటీవల సొంతూరికి వచ్చారు. ఈ క్రమంలో నీటి కోసం కోతులు పడుతున్న ఇబ్బందులు కళ్లారా చూశారు. అడవి ప్రాంతంలో కోతులు నీటి కోసం పాట్లు పడుతున్న తీరు చూసి చలించిపోయిన సురేష్.. వాటి దాహం తీర్చడానికి నడుం బిగించారు. భూపాలపల్లి నుంచి కాళేశ్వరం వరకు సుమారు 55 కిలో మీటర్ల మేర ప్రధాన రహదారి ఇరువైపులా నీటి తొట్టెలు ఏర్పాటు చేయించారు. దారి వెంబడి ప్రయాణించే వారు ఆ తొట్టెల్లో అప్పుడప్పుడూ కాసిని నీళ్లు పోస్తే అడవి జీవులు తమ దాహాన్ని తీర్చుకుంటాయని ఆయన చెప్తున్నారు. వన్యప్రాణులను సంరక్షించుకోవడం మన అందరి బాధ్యతని, వాటి కోసం కనీసం బాటిల్ నీరు దానం చేయడం పెద్ద కష్టం కాదని సురేష్ అంటున్నారు.













