అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగు : యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్

అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న భాష తెలుగు అని, అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 40 శాతం మంది తెలుగువారే ఉన్నారని హైదరాబాద్‌లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ వెల్లడించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా 9 బిలియన్ల డాలర్లు భారతీయ విద్యార్థుల నుంచే అందుతున్నాయని తెలిపారు. ది కమిటీ ఆఫ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ) ఆధ్వర్యంలో గ్లోబల్ అలియెన్స్ స్ట్రెంథెనింగ్ ఎకనమిక్ బ్రిడ్జెస్ అంశంపై హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో సదస్సు నిర్వహించారు.
ఎఫ్‌ఎల్‌ఓ చైర్ పర్సన్ ప్రియా గజ్దార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సదస్సుకి హైదరాబాద్‌లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, తెలంగాణ, ఏపీ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ ఓవెన్, దక్షిణాసియాలోని ఆస్ట్రేడ్‌కు ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్ డెనిస్ ఈటన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెన్ఫిఫర్ మాట్లాడుతూ భారత్, అమెరికాల మధ్య ఉన్నంత బలమైన సంబంధాలు ఏ దేశాలకూ లేవన్నారు. ఫార్మా, ఐటీ, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాల్లో నిపుణుల కోసం అమెరికా ఆసక్తిగా ఉన్నట్టు జెన్నిఫర్ లార్సన్ పేర్కొన్నారు.