ట్రంప్‌ను దైవంగా పూజిస్తున్న తెలంగాణ యువకుడు
తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ అనే యువకుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వీరాభిమాని. ఏకంగా ఆయన్ని ఆరాధ్య దైవంగా పూజించే స్థాయికి అభిమానం వెళ్లింది. ఏడాది కాలంగా తన ఇంటిలో ట్రంప్ చిత్రపటాన్ని పూజిస్తున్నారు. వేలు కోసుకొని రక్త తర్పణం కూడా చేస్తున్నారు. కృష్ణ తన ఫేస్ బుక్ పేజీలో ట్రంప్ కోసం చేస్తున్న పూజలకు సంబంధించిన ఛాయాచిత్రాలు, దృశ్యాలను పోస్ట్ చేశారు. వీటిని అతని మిత్రులు ట్విటర్లోనూ ఉంచారు.
తనను ఆరాధిస్తున్న కృష్ణ గురించి తెలుసుకున్న ట్రంప్ ఈ నెల 19న ట్విటర్ ద్వారా స్పందించారు. కోట్ల మంది భారతీయుల్లో కృష్ణను తన అప్తమిత్రుడిగా భావిస్తున్నాననీ, త్వరలోనే కలుద్దామని పేర్కొన్నారు. దీనిపై కృష్ణ స్పందిస్తూ, తనకు ట్రంప్ అంటే ఎంతో అభిమానమన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు చాలా ఏళ్లక్రితం డబ్ల్యూడబ్ల్యూఈ అనే కార్యక్రమంలో హోస్ట్‌గా వచ్చేవారనీ, చాలా ఉత్సాహంగా పాల్గొనేవారనీ, తొలిసారిగా ఆయన్ని అక్కడే చూశానన్నారు. అప్పట్నుంచే ట్రంప్ అభిమానిగా మారానని తెలిపారు. ట్రంప్ లోని ముక్కుసూటితనం, చురుకుదనం తనకెంతగానో నచ్చుతాయనీ, ఆయన హావభావాలు తనలో విపరీతమైన ఉత్సాహాన్ని నింపేవన్నారు.













