పచ్చదనంలో తెలంగాణ ప్రథమస్థానం
అడవుల పెంపకం, పచ్చదనం అభివృద్ధి, మొక్కలు నాటడం వంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. జాతీయ అటవీ పాలసీలోని గ్రీన్ మిషన్, మొక్కల పెంపకం విభాగాల్లో తెలంగాణ ముందువరుసలో ఉంది. 2016-17లో దేశవ్యాప్తంగా నాటిన మొక్కల్లో తెలంగాణ 26శాతం వాటా సాధించింది. కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్థన్ లోక్సభలో ఈ వివరాలు ప్రకటించారు. 2016-17లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 80,446 హెక్టార్లలో పచ్చదనాన్ని అభివృద్ధిచేసే లక్ష్యాన్ని నిర్దేశిస్తే, రాష్ట్రం 4,36,913 హెక్టార్లలో ఫలితాన్ని సాధించింది. ఇది నిర్దేశిత లక్ష్యంకంటే ఐదురెట్లు ఎక్కువ. 2015-16లో సైతం 59970 హెక్టార్ల లక్ష్యానికి గాను 2.36,598 హెక్టార్లలో ఫలితాన్ని సాధించింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణకు దరిదాపులో కూడా లేదు. కాగా ఆంధ్రప్రదేశ్ 2.45 లక్షల హెక్టార్లు, ఒడిశా 1.97 లక్షల హెక్టార్ల ఫలితాన్ని సాధించాయి. లోక్సభలో కేంద్ర పర్యావరణ మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.













