సెకెండ్ డోస్ వారికే వ్యాక్సిన్… మే 31 వరకు

తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో మే 31 వరకు సెకెండ్ డోస్ వారికే వ్యాక్సిన్ ఇస్తామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం బయటకు వచ్చే వారికి లాక్‍డౌన్ నుంచి మినహాయింపు ఉందని, తగిన పత్రాలు చూపి పోలీసులు అనుమతి పొందవచ్చని తెలిపారు. ఆస్పత్రుల్లో పడకల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల్లో పడకల కొరత లేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,783 ఆక్సిజన్ పడకలు, 17,267 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్‍ను సక్రమంగా వినియోగించాలని సూచించారు.
ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లోనే లాక్‍డౌన్ విధించిందని అన్నారు. ప్రభుత్వం అనుమతించిన 4 గంటల్లోనే బయటకు రావాలని సూచించారు. ప్రజలు బయటకు వచ్చిన సమయంలోనూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒకరు వస్తే సరిపోతుందని, అందరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు సహకరిస్తేనే లాక్‍డౌన్ ఫలితాలు అందుతాయని అన్నారు.