జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోండి.. ఎన్నికల కమిషనర్
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జిహెచ్ఎంసి కమిషనర్ మరియు డిప్యుటీ కమిషనర్లతో సమన్వయం చేసుకొని వారి వారి జిల్లాలలో జరుగబోయే ఎన్నికలు స్వేచ్చాయుత వాతవరణ౦లో జరిగే విధంగా పూర్తి చేయాలని ఎన్నికల అధికారి మరియు అదనపు ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి సూచించారు.
బుధవారం (5-11-2020) రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీహెచ్ఎంసీ కమిషనర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు)తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత పాలకవర్గం కాలపరిమితి 2021 ఫిబ్రవరి 10వ తేదీతో ముగుయనున్నందున ఈలోపు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, అక్టోబర్ 31వ తేదీన ఓటరు ఓటరు లిస్టుల తయారీకి నోటిఫికేషన్ చేయడం జరిగిందని, ముసాయిదా ఓటరు లిస్టులను నవంబర్ 7వ తేదీ వరకు ప్రచురించాలని, తుది జాబితా 13వ తేదీన ప్రచురించాల్సి ఉందన్నారు.
తుది జాబితా ప్రచురించిన తరువాత కూడా ఓటేరుగా నమోదు చేసుకొని వారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే లోపు ఎప్పుడైనా సంబంధిత డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కు ఆన్లైన్ లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.
అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు)కు డిప్యుటీ ఎలక్షన్ అథారిటీగా నియమిస్తున్నట్లు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసామన్నారు.
కోవిడ్ ముందస్తు చర్యలు తీసుకొనేలా విశాలమైన గదులు ఉండేవిధంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, స్థానిక రెవిన్యూ మరియు పోలీస్ అధికారులతో సంప్రదించి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1000 మందికి మించకుండా ఓటర్లు ఉండేలా చూడాలని, 1000 లోపు ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్ కు ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు ఇతర పోలింగ్ అధికారులు, 1000 కి మించి ఓటర్లు ఉన్న కేంద్రాలలో నలుగురు ఇతర పోలింగ్ అధికారులను నియమించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు మహిళా రిజర్వేషన్లను 2016 లో అమలు చేసిన విధంగానే ప్రస్తుత ఎన్నికల్లో అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
పోలీస్ అధికారుల సహకారంతో బందోబస్తు ప్లాన్ తయారు చేయాలని, ఎంసిసి, స్టాటిక్ సర్వేలన్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను గుర్తించాలన్నారు.
బ్యాలట్ బాక్సులను సురక్షితంగా భద్రపరిచేందుకు అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ & కౌంటింగ్ సెంటర్ల కొరకు అనువైన ప్రాంతాలను గుర్తించి కోవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు.
పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఎన్నికల నిమిత్తం 5 లక్షలకు మించి ఎన్నికల వ్యయం చేయరాదన్నారు.
ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ మరియు ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.













