జూలై 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం… కేబినెట్ నిర్ణయం

తెలంగాణలో పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. అన్ని కేటగిరీలకు చెందిన విద్యా సంస్థలకూ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ ఎత్తేసినంత మాత్రాన నిర్లక్ష్యం వహించరాదని, మాస్క్ ధరిస్తూ, భౌతికదూరం పాటించాలని కేబినెట్ కోరింది. సామాన్యుల బతుకుదెరువు తలకిందులు కాకూడదన్న ఏకైక నిర్ణయంతో లాక్‌డౌన్ ఎత్తేస్తున్నామని స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు రావడానికి రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ కేబినెట్ కోరింది. అయితే ఇన్ని రోజులుగా మూతపడ్డ పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడానికి కావల్సిన చర్యలను పాఠశాల విద్యా శాఖ ఎన్ని రోజుల్లో తీసుకుంటుందన్నది వేచి చూడాలి.
జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభమవుతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందుకు తల్లిదండ్రులు సిద్ధమా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. మామూలుగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు వ్యాక్సినేషన్ కొంత మేర పూర్తైంది కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. పాఠశాల విద్యా స్థాయిలో ఉన్న విద్యార్థుల విషయంలోనే కాస్త ఆందోళన చెందాల్సి ఉంటుంది. భౌతిక దూరం పాటించేలా చూడటం, మాస్క్, శానిటైజర్ వాడకంలో విద్యార్థులు శ్రద్ధ వహించేలా ఆయా విద్యా సంస్థలు ఎంత మేర కృషి చేస్తాయన్నది కూడా ఓ ప్రధాన సమస్యే.