రామగుండం, సిద్దిపేట, నల్గొండలో ఐటీ టవర్స్ : కేటీఆర్ ప్రకటన

కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదని, మంచి పురోగమనంలోనే ఉన్నామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రతి రంగంలోనూ అభివృద్ధి దిశలోనే పయనిస్తోందని ప్రకటించారు. తెలంగాణకు సంబంధించిన పరిశ్రమలు, ఐటీ శాఖ వార్షిక నివేదికలను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019-20 లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు 1.28 లక్షల కోట్లు కాగా, 202-21 లో 1.45 లక్షల కోట్లకు పెరిగాయని ప్రకటించారు. ఐటీలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి సాధించామని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, 7 సంవత్సరాల తర్వాత ఆ సంఖ్య ప్రభుత్వ విధానాలతో రెట్టింపు దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఐటీ రంగం 6.28 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తోందని, సుమారు 20 లక్షలకు పైగా మంది ఐటీ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఇదంతా కూడా సీఎం కేసీఆర్ వ్యూహం, ముందస్తు ప్రణాళికలు, సమిష్టి కృషితోనే సాధ్యమైందని పేర్కొన్నారు. ఆయా వ్యవస్థల్లో పారదర్శకత కోసమే నివేదికలను విడుదల చేస్తున్నామని అన్నారు. 2020-21 లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9.78 లక్షల కోట్లుగా ఉందని, వ్యవసాయ రంగంలో 20.9 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. దేశ తలసరి ఆదాయం 1,27,768 గా ఉండగా, రాష్ట్ర తలసరి ఆదాయం 2,27,145 గా ఉందని వెల్లడించారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ: మంత్రి కేటీఆర్
తెలంగాణలోని ద్వితీయ నగరాలకు కూడా ఐటీ విస్తరిస్తోందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రామగుండం, సిద్దిపేట, నల్లగొండ లోనూ తర్వలో ఐటీ టవర్స్ ఏర్పాటు చేసి, రాబోయే 2 సంవత్సరాల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి, దాదాపు 4 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, మహబూబ్ నగర్ ప్రాంతంలో త్వరలో సోలార్ పార్క్ రాబోతోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.