వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం : కేసీఆర్
కొవిడ్ వ్యాక్సిన్ను ప్రాధాన్యతాక్రమంలో అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై ప్రధాని చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారన్నారు. శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి అనుగుణమైన కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్ కూడా దేశమంతటి పైనా ఒకే రకమైన ప్రభావం చూపలేదు. వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్టస్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టీ మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలి. పది, పదిహేను రోజులు పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగతా వారికి ఇవ్వాలన్నారు.













