ఆధిక్యంలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర రెడ్డి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానం మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేకి 17,429 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థి ఎన్. రామచందర్ రావుకు 16,385 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 8,357, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 5,101 ఓట్లు వచ్చాయి.
ముందంజలో పల్లా రాజేశ్వర్ రెడ్డి
నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 16,130 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థికి 4,084 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్ధి తీన్మార్ మల్లన్ రెండో స్థానంలో ఉండగా… ప్రొఫెసర్ కోదండరాం మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు రెండో రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఈ రౌండ్ ముగిసే వరకూ పల్లా 7,871 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 12,070 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరామ్‌కు 9,448 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 6,669 ఓట్లు పోలయ్యాయి. ఇక… కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 3,244, రాణి రుద్రమకు 1,634, జయ సారథికి 1,263 ఓట్లు పోలయ్యాయి.













