ప్రవాస తెలంగాణ పౌరుల భద్రతకు హెల్ప్ డెస్క్
అమెరికా సహా ఏ దేశంలో తెలంగాణ పౌరులు నివసిస్తున్నా, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రవాస తెలంగాణవాసులందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తుందని, వారి అవసరాలను తీరుస్తామని తెలిపారు. అమెరికాలోని షికాగాలో హైదరాబాద్కు చెందిన ఐటీ విద్యార్థి సయ్యద్ మజహిర్ అలీపై దాడిని తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్కు చెందిన ఆలీ అనే విద్యార్థిపై షికాగోలో నలుగురు దొంగలు దాడి చేసిన విషయం తెలిసి కలత చెందాను. ఇది ఓహైయోలో హత్యకు గురైన బి. శ్రేయస్ రెడ్డి ఘోరమైన దాడి ఉదంతాన్ని తలపిస్తోంది. తెలంగాణ పౌరులు అమెరికా సహా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, వారి భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని, మా ఆందోళనలను అర్థం చేసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ను అభ్యర్థిస్తున్నా అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.







