పాస్ పోర్టు సేవల్లో తెలంగాణ నెంబర్ వన్
వినియోగదారులకు పాస్‌పోర్టు సేవలందించడంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ విష్టువర్ధన్‌రెడ్డి అన్నారు. పాస్‌పోర్టు కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విదేశీవ్యవహారాలు, తపాలాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఆబిడ్స్‌లోని డాక్‌సదన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఎంపీ నియోజకవర్గంలోనూ పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఇచ్చిన హామీకి అనుగుణంగానే ఈ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గతేడాది ప్రయోగాత్మకంగా వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రారంభించిన పాస్‌పోర్టు కార్యాలయాలు విజయవంతమయ్యాయని తెలిపారు.
తెలంగాణవ్యాప్తంగా 14, దేశ వ్యాప్తంగా 396 పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో గడిచిన రెండేండ్లలో 65 వేల మందికి పాస్‌పోర్టులు అందించామని తెలిపారు. గతేడాది వీటి ద్వారా 5.49 లక్షల పాస్‌పోర్టు దరఖాస్తులు రాగా, 5.20 లక్షల మందికి సేవలందించామని చెప్పారు. కేవలం రెండు వేల దరఖాస్తులే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియాలో తెలంగాణ పోలీసులు ఎంతో సహకరించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం నాలుగు రోజుల్లోగా, నగరాల్లో మూడు రోజుల్లోనే వెరిఫికేషన్ పూర్తవుతుందని వివరించారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలను వికారాబాద్, మంచిర్యాల మేడ్చల్‌లో సబ్ పోస్టాఫీసుల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇకపై పాస్‌పోర్టు కోసం ఏజెంట్లను సంప్రదించాల్సిన అవసరం లేదని, ఈ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీ చంద్రశేఖర్, పాస్‌పోర్టు రీజినల్ హెచ్ఆర్ ఆకాశ్దీప్చక్రవర్తి, పాస్‌పోర్టు జనరల్ హెడ్క్యార్టర్ రీజియన్ ఆర్ రాధిక చక్రవర్తి, పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్లు ఎస్వీ రావు, వీవీఎస్ ఎన్ రెడ్డి పాల్గొన్నారు.













