ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. చివరాటగా తెలంగాణ మున్సిపల్ మంత్రి కేటీఆర్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు సంధించుకోవడంతో మరింత వేడెక్కింది. ఖమ్మం, హైదరాబాద్ పట్టభద్రుల స్థానాల పరిధిలో గతంలో కంటే ఓటర్ల సంఖ్య పెరిగింది. ఎన్నికల ప్రచారం చివరి వరకూ వారందర్నీ ఆకట్టుకోవడానికి అభ్యర్థులందరూ గట్టిగానే కృషి చేశారు. ఈ రెండు స్థానాల్లో 10.36 లక్షల మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. 164 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు రెబెల్స్, స్వతంత్రులు కూడా ఈసారి ఎక్కువగానే బరిలో ఉన్నారు. మార్చి 14 న ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 17న ఫలితాలు వెల్లడవుతాయి. ఎన్నికలు జరిగే జిల్లాల్లో మద్యం షాపులు మూసేయాలని అధికారులు ఆదేశించారు. నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో 5 లక్షల 5 వేల 565 మంది ఓటర్లున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ లో 5 లక్షల 31 వేల 268 మంది ఓటర్లున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే టఫ్ ఫైట్ నడుస్తోంది. జీహెచ్ఎంసీ ఫలితాలతో పాటు దుబ్బాక ఫలితం టీఆర్ఎస్కు చేదు ఫలితాలను మోసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏకంగా మంత్రులను ఇన్చార్జిలుగా నియమించారు. హైదరాబాద్‌కు మంత్రి గంగుల కమలాకర్, రంగారెడ్డికి మంత్రి హరీశ్ రావు, మహబూబ్‌నగర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డిని నియమించారు. ఖమ్మంలో మాత్రం అక్కడి మంత్రులకే బాధ్యతలు అప్పజెప్పారు. మరోవైపు హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి సురభీ వాణిదేవి, ఖమ్మం- వరంగల్- నల్గొండ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థులుగా ఉన్నారు. ఇక హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థిగా ఎన్. రామచందర్ రావు, ఖమ్మం- వరంగల్- నల్గొండ నుంచి బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులుగా చిన్నారెడ్డి, రాములు నాయక్ బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో పెట్రో ధరలు, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే అంశం, ఐటీఐఆర్ లాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. టీఆర్ఎస్ తరపున మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. ఇక బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు.













