సాగర్ ఎమ్మెల్యే నోముల ఇకలేరు
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా న్యూరోలాజికల్ సమస్యతో బాధపడుతున్నారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బసచేసిన నర్సింహయ్య మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు సమీపంలోని అపోలో దవాఖానకు తరలించారు. వైద్యులు చికిత్స అందించేందుకు తీవ్రగా ప్రయత్నించినప్పటికీ శరీరం స్పందించలేదు. నర్సింహయ్య మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1956 జనవరి 9న పుట్టిన నర్సింహాయ్యకు ఇద్దరు కమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నోముల నర్సింహయ్య మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల మరణవార్త పార్టీ శ్రేణులను, అభిమానులను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. నకిరేకల్ మండలం పాలెం గ్రామంలోని వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నట్లు అధికారవర్గాలు తెలిపారు.













