ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు మంత్రి కేటీఆర్
స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నెల 15న తెల్లవారుజామున కేటీఆర్ నాయకత్వంలోని బృందం హైదరాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఆయన వెంట పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి, డిజిటల్ మీడియా, జీవశాస్త్రాల విభాగాల సంచాలకులు కొణతం దిలీప్, శక్తినాగప్పన్లు ఉంటారు. సదస్సు అనంతరం 22న రాష్ట్రానికి తిరిగివస్తారు. ఈసారి సదస్సులో తెలంగాణ ప్రగతిపై కీలకోపన్యాసం ఇవ్వడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులతో ఆయన భేటీ కానున్నారు. గత ఎనిమిదేళ్లుగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులకు మంత్రి కేటీఆర్ క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.













