కేంద్రం ముందుగా మేల్కొనకపోవడం వల్లే ఈ అవస్థలు : మంత్రి కేటీఆర్ ఫైర్

వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, లోపాలను ఎత్తిచూపిస్తూ తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని, కేంద్రానికి ముందు చూపు లేని కారణంగానే వ్యాక్సిన్ ఏర్పడిందని మండిపడ్డారు. ‘ఆస్క్ కేటీఆర్’పేరుతో మంత్రి కేటీఆర్ ప్రజలతో ముచ్చటించారు. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు సగానికి పైగా జనాభాకి వ్యాక్సిన్ అందిస్తే, భారత్ లో వ్యాక్సిన్ ప్రక్రియ కనీసం 10 శాతం దాటలేదని ఎద్దేవా చేశారు. ఆస్ట్రేలియా, అమెరికా, యూకె, జర్మనీ, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు పౌరులకు వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నాయని, మన దేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
దేశీయంగా వ్యాక్సిన్ సరఫరా తగినంత లేనికారణంగా కేంద్రం అమెరికా, కెనడా, డెన్మార్క్, నార్వే లాంటి దేశాల్లో నిరుపయోగంగా ఉన్న 50 కోట్ల వ్యాక్సిన్లకు సంబంధించిన ఆయా దేశాలతో వెంటనే చర్చను ప్రారంభించాలని సూచించారు. అంతేకాకుండా వాటిని భారత్‌కు రప్పించేందుకు చేయాల్సని ప్రక్రియను కూడా కేంద్రం ప్రారంభించాలని సూచించారు. దేశంలో వ్యాక్సిన్లు అత్యధికంగా ఉత్పత్తి కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇతర దేశాలు గత సంవత్సరమే మేల్కొని, పెద్ద ఎత్తున ఆయా కంపెనీలకు వ్యాక్సిన్లను సరఫరా కోసం ఆర్డర్లు ఇచ్చాయని, అయితే కేంద్రం మాత్రం ఈ సంవత్సరం జనవరిలో మేల్కొందని మండిపడ్డారు. దీంతో పాటు ఇతర దేశాలు తమ ప్రజలకి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ సరఫరాను అందించే ప్రయత్నం చేస్తుంటే, మన సర్కారు మాత్రం వ్యాక్సిన్ మైత్రితో ప్రమోషన్ పై దృష్టి పెట్టిందని చురకలంటించారు.
తెలంగాణలో ప్రక్రియ సాగుతోంది : కేటీఆర్
తెలంగాణలో మాత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఓల్డేజ్ హోమ్‌లలోనూ ప్రక్రియ సాగుతోందని, తెలంగాణలో రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసే సౌలభ్యం ఉందని వివరించారు. సాధ్యమైనంత త్వరగా అన్ని వయస్సుల వారికి వ్యాక్సినేషన్ చేయాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. అయితే వ్యాక్సిన్ సౌలభ్యం లేని కారణంగా ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లు సమకూర్చుకునేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భరోసా కల్పించారు. అయితే దురదృష్టవశాత్తు గ్లోబల్ టెండర్లు పిలిచినా, స్పందన రాలేదని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.