దుబాయ్‌లో మెదక్ వాసి మృతి

బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన నెల రోజుల్లోనే మెదక్ జిల్లా వాసి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అక్కడ సంపాదించిన తిరిగి ఇంటికి వస్తాడనుకున్న భార్యా, పిల్లలకు మరణవార్త కన్నీటినే మిగిల్చింది. మెదక్ జిల్లా తిమ్మక్కపల్లి తండాకు చెందిన రాట సూర్య (34) గత నెల 6న అబుదాబి వెళ్లగా, మూడు రోజుల క్రితం మరణించినట్లు కుటుంబ సభ్యులకు అక్కడి పోలీసులు నుంచి ఫోన్ వచ్చింది. కామారెడ్డి ఏజెంట్ ఇర్ఫాన్ సహకారంతో దుబాయి వెళ్లేందుకు రూ.1.50 లక్షల వరకు అప్పు చేసి పాస్‌పోర్ట్, వీసా తీసుకుని దుబాయికి వెళ్లిన సూర్య ఆ కంపెనీలో కొద్ది రోజుల మాత్రమే పని చేశాడు. ఇదిలా ఉండగా మూడ్రోజుల క్రితం సూర్య మరణించినట్లు దుబాయ్ పోలీసులు, ఏజెంట్‌తో పాటు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు. అయితే ఇది ప్రమాదమా? లేదా అనారోగ్యంతో మరణించడా? అన్నది స్పష్టం కాలేదు. ఈ క్రమంలో సూర్య మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సాయం కోరారు.