తెలంగాణలో లాక్‍డౌన్ ఎత్తివేత ?

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 20 తర్వాత లాక్‍డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతుండటంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు వీలుగా రోజంతా సాధారణ కార్యకలాపాలను అనుమతించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. వ్యవసాయ సీజన్ వేగం పుంజుకోవడంతో ఆంక్షల ఎత్తివేతను అనివార్యంగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ నెల 19 వరకు రాత్రిపూట కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై ఈనెల 20 లోపు నిర్ణయం తీసుకోవాలి. మంత్రిమండలి సమావేశం నిర్వహించి, అందులో చర్చించి ఉత్తర్వులు జారీ చేయాలి.
ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ కరోనా కేసుల తగ్గుదలపై రోజువారిగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తోంది. లాక్‍డౌన్ ఇకపై అవసరం లేదనే భావనతో ఆ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 21 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచిత టీకాల కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నేపథ్యంలో 20 నుంచి లాక్‍డౌన్ పూర్తిగా ఎత్తివేతకు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.