కేటీఆర్ విదేశీ పర్యటన ఫలప్రదం
42 వారాలు.. 80కి పైగా బిజినెస్ సమావేశాలు
45 రౌండ్‌టేబుల్ మీటింగులు, రెండు అంతర్జాతీయ సదస్సుల్లో కీలకోపన్యాసం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు ఇటీవల జరిపిన విదేశీ పర్యటన విజయవంతమైంది. యుకె, యుఎస్ఎలో ఆయన జరిపిన పర్యటన కారణంగా తెలంగాణకు పెట్టుబడులు విస్తృతంగా వచ్చాయి. మంత్రి కేటీఆర్ ముందుచూపు, చొరవతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలు, కల్పిస్తున్న అద్భుతమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అంతర్జాతీయ సంస్థలను తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయి. పలు సంస్థలు హైదరాబాద్‌లో తమ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.
రెండు దేశాల్లో రెండు వారాల పాటు పర్యటించిన కేటీఆర్ రెండు వారాల పర్యటనలోనూ బిజీ బిజీగా గడిపారు. యూకే, యూఎస్ లలో పర్యటించిన కేటీఆర్ 80కి పైగా బిజినెస్ సమావేశాలలోనూ, ఐదు రౌండ్ టేబుల్ సమావేశాలలోనూ, రెండు అంతర్జాతీయ సదస్సులలోనూ పాల్గొన్నారు. రెండు ప్రపంచ సదస్సులలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రగతిని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడంలో, 42 వేల మందికి ఉద్యోగాలు కల్పించడంలో చేసిన కృషి నిరుపమానమైనది. ఇంతకు మూడు రెట్లు పరోక్షంగా ఉపాధి లభించేలా పాటుపడ్డారు. మంత్రి కేటీఆర్ తన రెండు వారాల పర్యటనలో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో బిజీగా గడిపారు.
యూకే పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ లండన్ లో పర్యటించారు. యూఎస్ లో న్యూయార్క్, వాషింగ్టన్ డిసి, హోస్టన్, హెండర్సన్, బోస్టన్లలో పర్యటించిన కేటీఆర్ అక్కడ దిగ్గజసంస్థలతో భేటీ అయ్యారు. వివిధ రంగాలకు సంబంధించిన వ్యాపారవేత్తలతో భేటీ అయిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఐటి,ఐటీఈఎస్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఏరోస్పేస్, మెడికల్ డివైసెస్, ఇన్నోవేషన్, డేటా సెంటర్స్, ఆటోమోటివ్ అండ్ ఈవీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, భీమా తదితర రంగాలనుంచి పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు.
రెండు ప్రపంచ సదస్సులలోనూ తెలంగాణ ఘనకీర్తిని చాటిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాలను భారత ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని వెల్లడిరచారు. అంతేకాదు ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ లో పాల్గొని కాళేశ్వరం మరియు మిషన్ భగీరథ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణా విజయాలను వివరించారు.
ఐటీని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించే లక్ష్యంతో..
ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించే లక్ష్యంతో మంత్రి కేటీఆర్, ఐటీ రంగ నిపుణులు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమ య్యారు. వివిధ ఐటీ కంపెనీలకు చెందిన 30 మంది ఎన్నారై సీఈవోలతో అమెరికాలో సమావేశమై ద్వితీయ శ్రేణి నగరాల్లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ప్రభుత్వం ద్వారా కల్పించే రాయితీలు, ఇతర మద్దతును తెలియజేశారు. దీనికి ఐటీ కంపెనీల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా అధునాతన ఇంజినీరింగ్ టెక్నాలజీ సంస్థ సొనాటా సాఫ్ట్వేర్ నల్లగొండ ఐటీ టవర్‌లో 200 మంది ఐటీ నిపుణులతో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అలాగే, 3ఎం-ఈసీఎల్ఏటీ సంస్థ కరీంనగర్లో సంస్థ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రైట్ సాఫ్ట్వేర్ సంస్థ సమీప భవిష్యత్తులో వరంగల్‌లో సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
రెండు వారాల యూఎస్, యూకే పర్యటనలపై మంత్రి కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ప్రస్తుత సందర్భంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడంతోపాటు నిరుద్యోగ యువతకు 42 వేల ఉద్యోగావకాశాలు లభించనుండటం ఆనందంగా ఉన్నదని తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వంలో సాధించిన ప్రగతికి నిదర్శనమని అన్నారు. 2015లో తన అమెరికా పర్యటన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ, నాడు ఉన్న ఉత్సాహమే ఇప్పటికీ కొనసాగుతున్నదని, కంపెనీలు సైతం అంతే ఉత్సాహంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని చెప్పారు. ఈ విషయమై ట్విట్టర్లో స్పందిస్తూ.. తన విదేశీ పర్యటన ద్వారా ఒక్కో ప్రత్యక్ష ఉద్యోగం, దానికి అనుబంధంగా 3, 4 పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. నల్లగొండ, కరీంనగర్ సహా ఇతర ద్వితీయ శ్రేణి నగరాలు కూడా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. తమ పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రవాస భారతీయులు, వివిధ కంపెనీల ప్రతనిధులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ విభాగం కార్యదర్శి ఈ విష్ణువర్ధన్‌రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం, తెలంగాణ లైఫ్‌సైన్సెస్ విభాగం సీఈవో శక్తినగప్పన్, ఏరోస్పేస్-డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పీఏ ప్రవీణ్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి ఆత్మకూరి, ఇన్వెస్ట్ తెలంగాణ ఐపీవో వెంకట శేఖర్ తదితరులు మంత్రితోపాటు విదేశీ పర్యటనలో పాల్గొన్నారు.
పెట్టుబడులతో ముందుకు వచ్చిన కొన్ని దిగ్గజ కంపెనీలు
వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, మెడ్‌ట్రానిక్, స్టేట్ స్ట్రీట్, వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్, లండన్ స్టాక్ ఎక్సేంజ్ గ్రూప్, స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్‌లో ప్రపంచ దిగ్గజ సంస్థ డీఏజెడ్ఎన్, ఫ్రెంచ్ అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజ సంస్థ టెక్నిప్ ఎఫ్ఎంసీ, ప్రపంచ ఫైనాన్స్ సేవల సంస్థ అలియంట్ గ్రూప్, మూలకణ చికిత్సకు సంబంధించిన స్టెమ్‌క్యూర్స్, ప్రముఖ టెక్నాలజీ ఇన్నోవేషన్ కంపెనీ మోండీ, ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ జాప్‌కామ్ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
పెట్టుబడులకు ముందుకొచ్చిన దిగ్గజ సంస్థలు
తొమ్మిదేళ్లలోనే ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపించాయి. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో భాగం అయ్యేందుకు సంతోషంగా ముందుకువచ్చాయి. మంత్రి కేటీఆర్ తో సమావేశాల తరువాత తెలంగాణలో తమ పెట్ట్టుబడి, విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి.
రెండు ప్రపంచ సదస్సుల్లో ప్రసంగించి తెలంగాణ రాష్ట్ర ప్రగతి, ఇక్కడి వ్యాపార అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పారు. ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ అంశంపై ఈ నెల 12న లండన్‌లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ చేపట్టిన వివిధ పథకాల గురించి వివరించారు. అనేక తెలంగాణ పథకాలను నేడు భారత ప్రభుత్వం కూడా చేపట్టి అమలు చేస్తున్నదని, తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మాడల్‌గా మారిందని తెలిపారు. ఈ నెల 22న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో అమెరికాలోని నెవాడా రాష్ట్రం హెండర్సన్లో నిర్వహించిన ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్‌లో పాల్గొని కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల విజయగాథను వివరించారు. లండన్‌లో భారత హైకమిషనర్ ఏర్పాటుచేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ, గత తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని తెలియజేశారు.
ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి, ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, హైదరాబాద్‌లోని ఆవిష్కరణల ఎకోసిస్టం గురించి వివరించారు. న్యూయార్క్‌లో ఇండియన్ కాన్సులేట్ జనరల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ, భారత్‌లో తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానమని, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు తెలంగాణ గేట్వేగా మారిందని తెలిపారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగంపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, గత తొమ్మిదేండ్లలో ఈ రంగంలో తెలంగాణ గణనీయ వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ (ఏహెచ్ఏ), సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషన్ స్టడీస్ (సీఎస్ఐఎస్) నిర్వహించిన సదస్సుల్లోనూ పాల్గొని విద్య, వైద్య రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు.













