పరీక్షలు రాస్తేనే… పాస్ చేస్తాం : తెలంగాణ సర్కార్
తెలంగాణలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఇంటర్‌బోర్డు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. పరీక్షలు జరపకుండా విద్యార్థులను పాస్ చేసే ఆలోచన ఏదీ తమ వద్ద లేదని తేల్చి చెప్పింది. మరో రెండు మూడు రోజుల్లో విద్యార్థులకు హాల్ టిక్కెట్లను జారీ చేస్తామని బోర్డు వెల్లడించింది. అయితే ఏప్రిల్ 7 నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్స్ మాత్రం వాయిదా పడే అవకాశాలున్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు తెలంగాణ సర్కార్ సెలవులు ప్రకటించింది. అయితే ఇది తాత్కాలికమేనని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. ఆన్లైన్ క్లాసులు మాత్రం యథావిథిగా జరుగుతాయని సర్కార్ తెలిపింది.













