సచివాలయ కూల్చివేత పనులకు హైకోర్టు బ్రేక్
సచివాలయ భవనాల కూల్చివేత పనులు సోమవారం వరకు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్.విశ్వేశ్వరరావు హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న సచివాలయ ప్రాంతంలో కొత్త నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా నిర్మించాలని భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లను విచారిస్తూ వచ్చిన ఉన్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. కొత్త సచివాలయ భవనం నిర్మాణం కోసం ప్రస్తుత భవనాల్ని కూల్చివేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం కూల్చివేత ప్రారంభించింది. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పనులు నిలిచిపోనున్నాయి.













