అన్నీ భవిష్యత్తులోనే చేస్తారా? అంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను నివేదిస్తూ తెలంగా ణ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో తామిచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని ఎందుకు అమలు చేయలేదని సూటిగా ప్రశ్నించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స ధరలు ఒకే విధంగా ఉండాలన్న తమ ఆదేశాలను అమలు చేశారా? అంటూ సూటిగా ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకు గరిష్ఠ ధరలను సవరిస్తూ కొత్త జీవోను జారీ చేశారా? 14 కొత్త ఆర్‌టీపీసీఆర్ ల్యాబ్‌లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. కోవిడ్ సెకండ్ వేవ్ సన్నద్ధత విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వివరాలు ఏమాత్రం సమగ్రంగా లేవని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. బంగారం, నగలను తాకట్టుపెట్టి ప్రజలు ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారని హైకోర్టు పేర్కొంది. అలాగే బ్లాక్ ఫంగస్‌కు సంబంధించిన ఔషధాలను ఎందుకు సరఫరా చేయలేదో తెలపాలని హైకోర్టు కేంద్రాన్ని కోరింది. అయితే హైకోర్టు తెలంగాణ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలే చేసింది.‘‘అన్నీ భవిష్యత్తులోనే చేస్తారా? ఇప్పుడేమీ చేయడం లేదా?’’ అంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యింది. అయితే హైకోర్టు అడిగిన ప్రశ్నలకు తాను ఇప్పుడే సమాధానం ఇవ్వలేనని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు ఖమ్మం వెళ్లినందుకు ఆయన విచారణకు హాజరు కాలేదని, పై ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా పరీక్షలను పెంచుతున్నామని, ఏప్రిల్ 29 నాటికి లక్ష పరీక్షలను చేశామని ఆరోగ్యశాఖ హైకోర్టుకు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆస్పత్రులను కరోనా చికిత్స లైసెన్స్‌లను రద్దు చేశామని, కొన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశామని ఆరోగ్య శాఖ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇక కరోనా స్థితిగతుల విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.