ఆ అధికారం పోలీసులకు లేదు : హైకోర్టు
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినపుడు వాహనాలకు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అంశంపై దాఖలైన 40 రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ వరస ఆదేశాలను జారీ చేశారు. వాహనం నడుపుతున్నపుడు డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు తేలితే, వాహనం నడిపేందుకు సరైన డ్రైవింగ్ లెసెన్సు ఉన్న వ్యక్తిని పోలీసులు అనుమతించాలని లేదా సమీప బంధువు, లేదా స్నేహితుడికి తెలియజేసి వాహనం నడపడానికి అనుమతిచాలని కోర్టు పేర్కొంది. పై ఆదేశాలను అమలు చేయని పక్షంలో మాత్రమే సంబంధిత పోలీసులు వాహనాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
స్వాధీనం చేసుకున్న వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌కు సమర్పించిన తర్వాత పోలీసులు అధికారులు వాహనాన్ని యజమానికి లేదా అధీకృత వ్యక్తిని విడుదల చేయాలని పేర్కొంది. కారు నడుపుతున్న వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయాల్సి ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలీసు అధికారి మూడు రోజుల్లో సంబంధిత మేజిస్ట్రేట్ ముందు చార్జీషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే దిక్కారంగా పరిగణిస్తామని కోర్టు పేర్కొంది.













