అన్ని జిల్లాల్లో టోల్‌ఫ్రీ నెంబర్ లు ఏర్పాటు చేయండి : హైకోర్టు

కరోనా నియంత్రణ విషయంలో తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు తగ్గడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రోజుకు లక్ష పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని వారాంతపు లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూను పొడగింపును పరిశీలించాలని సూచించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఔషధాల ధరలను ఓ సారి చూడాలని కోర్టు సూచించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసిన విధంగానే వారంలోగా అన్ని జిల్లాల్లో టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనాపై రెండు రోజుల్లోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, శ్మశానవాటికలు, వాటి సదుపాయాలపై కూడా వివరాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి వాహనాలను ఎందుకు సీజ్ చేయడం లేదని డీజీపీని ప్రశ్నించింది. అదేవిధంగా బ్లాక్ మార్కెట్‌పై పోలీసులు దృష్టి పెడుతున్నారా? అని కూడా ఆరా తీసింది. ప్రతి కమిషనరేట్‌లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దీనిపై ప్రత్యేక నిఘా పెట్టారని డీజీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదు చేశామని వివరించారు.
డీజీపీ వివరణ
కరోనా నేపథ్యంలో పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలపై డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు వివరించారు. 859 పెట్రోల్ మొబైల్ కార్లు శాంతిభద్రతల పర్యవేక్షణలో ఉన్నాయని పేర్కొన్నారు. మూడు కమిషనరేట్‌లలో 20 టీమ్స్ ఏర్పాటు చేవామని, జిల్లాలో 10 స్పెషల్ టీమ్స్‌ను కూడా ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. బ్లూకోట్స్, పెట్రోలింగ్ ద్వారా కోవిడ్ అవేర్‌నెస్ పెంచుతున్నామని, ప్రతి కోవిడ్ సెంటర్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ హైకోర్టుకు విన్నవించారు.