గవర్నర్‌పై కోర్టుకెక్కిన తెలంగాణ సర్కార్.. సీజే ఏమన్నారంట..!
తెలంగాణ ప్రభుత్వం – రాష్ట్ర గవర్నర్ కి మధ్య విభేదాల వేళ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఇంత వరకూ ఆమోదం పొందకపోవడంపై బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు(సోమవారం) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి కూడా లభించింది. అయితే అంతకుముందు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు విషయంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అనుమతి కోరిన సమయంలో.. ‘గవర్నర్‌కి, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న ఈ వివాదంలో తాము ఎలా జోక్యం చేసుకుంటామని అన్నారు. ‘‘గవర్నర్ విధుల్లో కోర్టులు న్యాయ సమీక్ష చేయొచ్చా? కోర్టులు మరీ ఎక్కువ జోక్యం చేసుకుంటున్నాయని మీరే అంటారు కదా? అసలు ఈ వ్యవహారంలో గవర్నర్ కు కోర్టు నోటీసులు ఇవ్వగలదా? మీరే ఆలోచించండి’ అని సీజే ఉజ్జల్ అన్నారట.
అయితే రాష్ట్ర బడ్జెట్ డ్రాఫ్ట్ కాపీలకు గవర్నర్ ఆమోదం తెలపలేదని, మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉందని ఏజీ వివరించారు. ఆ లోపు గవర్నర్ ఆమోదం తెలపకపోతే బాగా ఇబ్బంది అవుతుందని ఏజీ వివరించడమే కాకుండా.. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుకు అనుమతిస్తే అన్ని విషయాలూ తెలియజేస్తానని అన్నారు. దీంతో బెంచ్ అంగీకరించింది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వాదనలు ఎలా ఉంటాయి? హైకోర్టు ఎలా స్పందిస్తుందనే దాని ఉత్కంఠ నెలకొంది.













