ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వం కన్నా పవర్‌ఫుల్లా?
తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వం కన్నా శక్తిమంతంగా కనిపిస్తున్నాయని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దాదాపు 30 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసినా వివరణ ఇవ్వలేదేమని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరై కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. కొరోనా పరీక్షల సంఖ్య పెంచామని గత 2వ తేదీ పెద్ద సంఖ్యలో పరీక్షలు చేశామని తెలిపారు. ఇకపై రోజుకి 40వేల పరీక్షలు చేయాలని ప్రణాళిక రచించామన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో కేసులు తగ్గుముఖం పట్టాయని హైకోర్టుకు విన్నవించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని వివరాలతో బులెటిన్స్ విడుదల చేస్తున్నామని చెప్పారు.
ప్రైవేటు ఆసుపత్రులపై 50 ఫిర్యాదులు వచ్చాయని 48 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామన్నారు. నియంత్రణ చర్యల్లో భాగంగా హితం యాప్‌ని వినియోగంలోకి తెచ్చామన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై పలు ప్రశ్నలను సంధించింది. హితం యాప్స్‌కి సంబంధించిన ప్రకటనలేవీ కనిపించడం లేదేమని ప్రశ్నించింది. కొరోనా రోగుల్ని దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్స్‌లు ఎందుకు రద్దు చేయడం లేదని సూటిగా ప్రశ్నించింది. ఈ సందర్భంగా కొరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ తమను అపార్ధం చేసుకోవద్దంటూ హైకోర్టు అభ్యర్ధించింది. చిన్న చిన్న తప్పులు కూడా జరగకుండా చూడాలనేదే తమ ప్రయత్నమని వ్యాఖ్యానించింది.













