తెలంగాణలో 47కి చేరిన కరోనా కేసులు
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. రోజురోజుకూ పాజటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులను వైద్యులు నిర్ధారించారు. దీంతో తెలంగాణ కరోనా కేసుల సంఖ్య 47కి చేరింది. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ రాష్ట్రంలో 47 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో వైరస్ వెలుగుచూసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 22 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న పరికరాలుతో పాటు వైద్య సిబ్బంది సహకారం కూడా అందిస్తామని ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో ప్రభుత్వం హాస్పిటల్, రెండో విడతలో ప్రైవేట్ కాలేజీలను ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అలాగే 10వేల పడకలు, 700 ఐసీయూ, 170 వెంటిలెటర్స్ ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.













