సిట్ ను ప్రశ్శించిన హైకోర్టు.. దర్యాప్తు ఇంకెంతకాలం
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నెలన్నర రోజులైనా సిట్ దర్యాప్తు ఎందుకు పూర్తికావడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సిట్ దర్యాప్తు కొంతవరకు సంతృప్తిగా ఉందని, కానీ వేగంగా జరగడం లేదని అభిప్రాయపడిరది. ప్రస్తుత దశలో దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. దర్యాప్తు ఇంకెంతకాలం చేస్తారని సిట్‌ను ఉద్దేశించి హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, సభ్యుడిని విచారించామని సిట్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీల్లో ఒకరి నుంచి అభిప్రాయం తీసుకోవడానికి అనుమతివ్వగలరా? అని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు అడిగింది. హైదరాబాద్ సీపీ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోందని ఏజీ తెలిపారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది అందరినీ విచారించారా? ఎంతమంది లబ్ది పొందారు? జూన్ 5న దర్యాప్తు పురోగతి నివేదిక ఇవ్వాలి అని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 5కి వాయిదా వేసింది.













