దళితబంధు నిలిపివేతపై హైకోర్టులో.. విచారణ
హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చాయి. సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్ రెడ్డిల ధర్మాసనం విచారణ జరిపింది. పథకం నిలిపివేతపై దాఖలైన మూడు ప్రయోజన వ్యాజ్యాలకు సంబంధించిన వాదనలు ముగియడంతో ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్, వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ.. దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. పథకం నిలిపి వేయాలన్న వీసీ ఉత్తర్వులు రద్దు చేయాలని లక్ష్మయ్య, జడ్సన్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు ప్రత్యక్ష లబ్ది బదిలీ పథకాలను ఉప ఎన్నిక అయ్యే వరకు నిలిపి వేయాలని వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ కోరింది.
ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రకటించి.. హుజూరాబాద్ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.













