తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జన సంచారం తగ్గించేందుకు చర్యలెందుకు చేపట్టడం లేని ప్రశ్నించింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలు, షాపింగ్ మాల్స్‌లో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ‘‘పబ్బులు, మద్యం దుకాణాలపై చర్యలు ఏం తీసుకున్నారు? మీకు ఆదాయమే ముఖ్యమా?’’ అంటూ తీవ్రంగా కన్నెర జేసింది. కరోనా విషయంలో జిల్లా అధికారులు ఇచ్చే రిపోర్టులు, ప్రభుత్వం ఇచ్చే రిపోర్టులకు చాలా వ్యత్యాసం ఉందని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అటార్నీ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ సమాధానంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు? అంటూ సూటిగా ప్రశ్నించింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? లేదా ఆదేశాలు ఇవ్వమంటారా? అని హెచ్చరించింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మధ్యాహ్నం లోగా నివేదించాలని గడువు విధించింది. అంతేకాకుండా సంబంధిత అధికారులు విచారణకు హాజరు కావాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ప్రజల స్థిగతులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కర్ఫ్యూ, లాక్డౌన్ విధించమని ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల ద్వారా ప్రజలను నియంత్రిస్తుందా? లేదంటే మిగితా రాష్ట్రాల లాగా కర్ఫ్యూ, లాక్డౌన్ విధిస్తుందా? అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.













