తెలంగాణ ఇచ్చిన సోనియాను విమర్శిస్తే రాళ్లతో కొడతారు : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

తెలంగాణ ప్రజల చిరకాల కల అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన దేవత సోనియా గాంధీ అని, అలాంటి తల్లిని విమర్శిస్తే ప్రజలే వాళ్లని రాళ్లతో కొడతారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇటీవల సోనియా గాంధీని విమర్శిస్తూ జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై ఐలయ్య మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు తల్లి సోనియా గాంధీ తప్పనిసరిగా వస్తారు. ఆమె తెలంగాణ ఇచ్చిన దేవత. అందుకే ఆమెను సీఎం ఆహ్వానించారు. రాష్ట్రం ఇచ్చినప్పుడు కేసీఆర్, ఆయన కుటుంబం సోనియమ్మ కాళ్ల దగ్గర మోకరిల్లి టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మోసం చేశారు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, జగదీష్ రెడ్డికి పదవులు వచ్చేవా..? అలాంటి సోనియమ్మను విమర్శిస్తే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు. జగదీశ్ రెడ్డి కేసీఆర్ దగ్గర ఊడిగం చేసుకుంటే బెటర్. ఇంకా ఆయన పవర్‌లో ఉన్నాననే భ్రమలో ఉన్నట్లున్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందనే విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకుంటే మంచిది’’ అంటూ బీర్ల ఐలయ్య నిప్పులు చెరిగారు.