లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసిన తెలంగాణ… ఇకపై ఏ ఆంక్షలూ ఉండవ్

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతోనే ఈ నిర్ణయమని సీఎం కేసీఆర్ మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై వైద్యశాఖ అధికారులు కేబినెట్‌కు ఓ నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని నిబంధనలనూ పూర్తిగా ఎత్తేయాలని కేబినెట్ ఆయా శాఖల అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం రాష్ట్ర కేబినెట్ ప్రగతి భవన్‌లో సమావేశమైంది. అయితే రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ ఉంటుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం పూర్తిగా తప్పని తేలిపోయింది. తొలుత మే 14 నుంచి 20 వరకూ లాక్‌డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ అంటే నాలుగు గంటల పాటు సడలింపులిచ్చారు. ఆ తర్వాత మే 21 నుంచి 31 వరకూ మరో సారి లాక్‌డౌన్ పొడిగించారు. అప్పుడు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపులిచ్చారు. దీనిని మరోసారి పరిశీలించింది కేబినెట్. ఆ తర్వాత జూన్ 1 నుంచి 10 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఆ తర్వాత కూడా పొడిగించారు. మరో 10 రోజులు పొడిగించారు. ఆ సమయంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సడలింపులిచ్చారు. తాజాగా లాక్‌డౌన్ మొత్తాన్ని ఎత్తేస్తున్నట్లు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
మొట్టమొదటి రాష్ట్రం… తెలంగాణ
కరోనా సందర్భంగా విధించిన లాక్‌డౌన్‌ను పూర్తిగా ఆంక్షలు ఎత్తేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకి ఎక్కింది. చాలా ఆలస్యంగా లాక్‌డౌన్‌ను విధించి, అత్యంత తొందరగా పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తేసిన రాష్ట్రం కూడా తెలంగాణయే. రాష్ట్ర ఆర్థిక పరిస్థతి, ఇతరత్రా కారణాల రీత్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.