తెలంగాణ ప్రభుత్వం మరో ఛాన్స్… జనవరి 31 వరకు గడువు
తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులకు రవాణా శాఖ మరో ఛాన్స్ ఇచ్చింది. పెండింగ్ చలానాల చెల్లింపునకు గడువుతేదీని జనవరి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండిరగ్ చలానాలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం డిసెంబరు 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించటంతో మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండిరగ్లో ఉన్న 1.05 కోట్ల చలానాలు చెల్లించారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం సమకూరింది. సాంకేతిక సమస్యతో చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని వాహనదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయితీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.













