ఇళ్లు లేని పేదలకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. ఒక్కొక్కరికీ రూ.3 లక్షలు!
తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు ఈ రోజు (సోమవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఆఖర్లో తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ఈ ఏడాది చివరిగా పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో ముందు నుంచే ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే బడ్జెట్లో అభివృద్ధికి, సంక్షేమానికి సమానంగా నిధులు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రకటించారు. మొత్తం రూ.2,90,396 కోట్ల అంచనాతో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే అనేక సంక్షేమ పథకాలకు వేల కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
అందులో భాగంగానే రాష్ట్రంలో సొంత జాగా ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు భారీ ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారాయన. సొంత జాగా ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు 3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుండి 2 వేల చొప్పున లబ్దిదారులకు ఎంపిక చేసి రూ.3 లక్షల ఆర్ధిక సాయం అందించనున్నారు. దీనికి తోడు సీఎం కోటాలో మరో 25 వేల మందికి అదనంగా సాయం అందనుంది. మొత్తం 2.63 లక్షల మందికి రూ.7890 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి త్వరలోనే గైడ్ లైన్స్ కూడా విడుదల కాబోతున్నాయి.
ఇవి మాత్రమే కాకుండా.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు.. ఆసరా పెన్షన్లకు 12,000 కోట్ల రూపాయలు.. ఇలా అనేక పథకాలకు కీలక కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.













