ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి? ఈటలకు గవర్నర్ ఫోన్
తెలంగాణ గవర్నర్ తమిళిసై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్‌కు ఫోన్ చేశారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ ఫోన్ చేశారు. కేసుల కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలేమిటి? చెప్పాల్సిందిగా గవర్నర్ ఈటలను కోరారు. ఏ వ్యక్తికైనా కరోనా చివరి దశకు చేరేంత వరకూ ఆగకూడదని, ప్రాథమిక దశలో ఉన్న సమయంలోనే గుర్తించాలని గవర్నర్ సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ అన్న మూడు పద్ధతుల్లో కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ఈటల వివరించారు. కరోటా కట్టడికి ఓ ప్రత్యేక యాప్‌ను కూడా తీసుకొచ్చామని గవర్నర్‌కు తెలిపారు. ఇలా ప్రత్యేక యాప్ తీసుకురావడంపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని రూపొందించిన వైద్య బృందాన్ని గవర్నర్ అభినందించారు.
ఆదివారం నాటికి తగ్గిన పాజిటివ్ కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో వెయ్యి మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 3,13,237 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,746 యాక్టివ్ కేసులున్నాయని వైద్యశాఖ వెల్లడించింది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోనూ కరోనా పెరుగుతోందని అధికారులు తెలిపారు.













