ప్రభుత్వంపై తెలంగాణ గవర్నర్ విమర్శల కలకలం
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ ఆమె కరోనా నివారణ చర్యలలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది అని అర్ధం వచ్చేలా మాట్లాడడం సంచలనంగా మారింది. దీనిపై ప్రభుత్వం నుంచి పలువురు స్పందిస్తూ గవర్నర్ వ్యాఖ్యలు భాజాపా ప్రతినిధిగా మాట్లాడినట్టు ఉన్నాయన్నారు. దీనికి భాజాపా నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు.
ఇంతకీ గవర్నర్ ఏమన్నారంటే…
కోవిడ్ 19 వ్యాప్తిపై తగిన చర్యలు చేపట్టాలని సిఎం కెసియార్‌కు ఎన్నో లేఖలు రాశానని అయితే ఆయన నుంచి ఏ స్పందనా రాలేదని తెలంగాణ గవర్నర్ తమిళసై మంగళవారం ఓ పత్రికతో మాట్లాడుతూ చెప్పారు. ఫార్మా మెడికల్ హబ్‌గా ఉన్న రాష్ట్రం ఇంతకన్నా మిన్నగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవలసిందని ఆమె అభిప్రాయపడ్డారు. తాను ఈ పరిస్థితిపై ముందే హెచ్చరించినా ప్రభుత్వం మాత్రం తక్కువ అంచనా వేసిందన్నారు. కెసియార్‌కు తాను 6-7 దాకా లేఖలు రాశానన్నారు. అయితే అవెందుకు నిర్లక్ష్యానికి గురయ్యాయో వాటిని సరైన విధంగా ఎందుకు స్వీకరించలేకపోయారో తెలియక ఆశ్చర్యపోయానన్నారు. కేవలం ప్రజల కోసమే తాను అలా చేశానని స్పందన రానందుకు తాను కొంచెం బ్యాడ్ గా ఫీలయ్యానని అన్నారు. ఎట్టకేలకు తన సూచనల్ని ఇప్పుడు ప్రభుత్వం కాస్త పట్టించుకుని చర్యలు చేపడుతున్నట్టు అనిపిస్తోందని అయితే ఇప్పటికే ఆలస్యం అయిందన్నారు. కోవిడ్ కేసుల్లో 80శాతం వరకూ దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉన్నాయని ప్రధాని చెప్పారని ఆమె గుర్తు చేశారు. అందులో తెలంగాణది పెద్ద వాటా అన్నారు.
తెలంగాణలో కేవలం 50 కేసుల దగ్గర ప్రారంభమై ఇప్పుడు 2500 కేసుల వరకూ వచ్చామన్నారు. మొదటి నుంచే ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలకు ఐసిఎమ్ ఆర్ తెలంగాణకు అనుమతి ఇచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వాటికి అనుమతి ఇవ్వలేదన్నారు. ఓ మూడు ఆసుపత్రులకు ఇప్పుడు అనుమతి ఉన్నా.. అది సరిపోదన్నారు. చాలా మంది పరీక్షలు చేయించుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష చేయించుకోవడం వారి హక్కు అని ఆమె అన్నారు. జిల్లాల వారీగా పరీక్షలు, మొబైల్ టెస్టింగ్ యూనిట్స్ ఏర్పాటుకు ప్రజల నుంచి పెద్ద యెత్తున విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సౌకర్యాలు యుద్ధ ప్రాతిపదికన మెరుగు పరచాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి చెందిన 33 జిల్లాల ప్రజలూ తెలంగాణకు పరీక్ష, చికిత్స ల కోసం రావాల్సి వస్తోందని, ప్రభుత్వం 7వేల వైద్యులు కావాల్సి ఉందని చెబుతోందని కాని 2,200 ఖాళీలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం 30వేల బెడ్స్ ఉన్నట్టు అంటోందని అయితే కేవలం బెడ్స్ ఉంటే సరిపోదని మౌలిక వసతులు, సిబ్బంది కూడా ఉండాలన్నారు. దాదాపు 20వేల మంది నర్సుల అవసరం ఉంటే కేవలం 4,373 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారన్నారు. తనమాటలు ఒక అమ్మమ్మ మంచి పలుకుల్లా తీసుకోవాలే తప్ప సవతి తల్లి సందేహాస్పద వ్యాఖ్యల్లా చూడొద్దని ఆమె కోరారు.













