పద్మ పురస్కార గ్రహీతలకు ప్రభుత్వ సన్మానం
భాషా సంస్కృతి, ఆచార వ్యవహారాలను పదిలపర్చుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శిల్పకళావేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్మ అవార్డు గ్రహీతల సన్మాన సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేళు ఆనందచారి, దాసరి కొండప్ప, ఉమామహేశ్వరి, గడ్డం సాంబయ్య, కేతావత్ సోమ్ లాల్, కూరెళ్ల విఠలాచార్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కళాకారులను గుర్తించి ప్రోత్సహించడంలో కళలకు శాశ్వత గుర్తింపు లభిస్తోందన్నారు. దేశంలో అత్యధికంగా మాట్లాడుకునే భాషలో తెలుగు భాషకు ద్వితీయ స్థానం ఉందని సీఎం గుర్తు చేశారు.
పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల నగదు బహుమతి, ప్రతినెల రూ.25 వేల పెనన్ష్ను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. దేశంలో అత్యధిక దూరం ప్రయాణించి ప్రజల సమస్యలను తెలుసుకున్న ఏకైక నాయకుడు వెంకయ్య నాయుడని ప్రశంసించారు. ఉప రాష్ట్రపతిగా అమూల్యమైన సేవలు అందించారని గుర్తు చేశారు. భవిష్యత్లో వెంకయ్య నాయుడు రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఒకటి రెండు సినిమాలు విజయంతం కాగానే గర్వపడే నటులు ఉన్న ఈ రోజుల్లో 46 సంవత్సరాల నుంచి నిర్విరామంగా 150 కి పైగా సినిమాలు చేసిన నిగర్విగా ఉండటం చిరంజీవికే సొంతమని ప్రశంసించారు. కవులు, కళాకారులు, భాషా సాంప్రదాయాలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందన్నారు. కలిసికట్టుగా భాష సంస్కృతిని కాపాడుకోపోతే ఒక్కప్పుడు తెలుగు భాష ఉండేదని చరిత్రలో చదువుకోవల్సి వస్తోందన్నారు.













