వ్యాక్సినేషన్ పాలసీని ప్రకటించిన తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం తన వ్యాక్సినేషన్ పాలసీని ప్రకటించింది. వ్యాక్సినేషన్, లాక్‌డౌన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, కమిషనర్‌లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇందులో కరోనా వ్యాక్సినేషన్ పాలసీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదటగా ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’ కే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ జాబితాలోకి జర్నలిస్టులు, గ్యాస్ బాయ్స్, కూరగాయల వ్యాపారులతో పాటు చిరు వ్యాపారులు కూడా ఉన్నారు. వ్యాక్సినేషన్‌లో ప్రథమ ప్రాధాన్యం వీరికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఆగిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పై జాబితాలో ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఇదే విషయంలో కేసీఆర్‌ను మెచ్చుకున్న మోదీ
కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు ఫోన్ చేసి పలు సూచనలు చేశారు. అతి వేగంగా కోవిడ్ వ్యాప్తి కారకులను గుర్తించి, వారికి ముందుగా టీకాలు వేయాలని సూచించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్, వీధి వ్యాపారులు, కార్మికులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దీని ద్వారా కరోనా అదుపులోకి వస్తుందని తెలిపారు. వెంటనే కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఈ విషయాన్ని ప్రధాని మోదీకి తెలిపారు. దీంతో ప్రధాని సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ‘మీరు చేసిన సూచనలు హర్షవర్ధన్ వివరించారు. మీ ఆలోచన, సూచనలు బాగున్నాయి. మీకు అభినందనలు. తప్పకుండా ఆచరణలో పెడతాం’’ అని మోదీ పేర్కొన్నారు.