కేరళకు తెలంగాణ ప్రభుత్వం మరో సాయం
భారీ వర్షలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో చేయూతనిచ్చింది. వరద భాదితుల సహాయార్థం ఇప్పటికే రూ.25 కోట్లు ప్రకటించిన ప్రభుత్వం, అక్కడి చిన్నారుల కోసం ఆకలిబాధలు తీర్చేందుకు రూ.52.5 లక్షల విలువ చేసే వంద మెట్రిక్ టన్నుల బాలామృతం ఆహారాన్ని కేరళకు తరలించనుంది. బాలామృతం పథకం కింద నాచారంలోని తెలంగాణ పుడ్లో సిద్ధం చేసిన పౌష్టికాహారాన్ని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక విమానంలో కేరళకు తరలిస్తున్నారు. సైనిక విమానం వద్దకు వెళ్లే బాలామృతం వాహనాలను తెలంగాణ పుడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయేంద్ర బోయే, చైర్మన్ ఎలక్షన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. కేరళ వరద బాధితుల సహాయార్థం బాలామృతం పౌష్టికాహారాన్ని ముఖ్యమంత్రి ఆదేశానుసారం పంపిస్తున్నామని విజయేంద్రబోయే తెలిపారు. ఏడు నెలల పిల్లల నుంచి మూడేళ్ల వయస్సున్న పిల్లలకు ఈ సమయంలో పౌష్టికాహారంగా బాలామృతం ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.













