రాష్ట్ర అవతరణ వేడుకలు రద్దు !

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఈసారి జరిగే అవకాశం లేదు. కరోనా, లాక్‍డౌన్ దృష్ట్యా ఉత్సవాలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కరోనా కారణంగా గత ఏడాది ప్రభుత్వం ఈ ఉత్సవాలను రద్దు చేసింది. సీఎం కేసీఆర్ హైదరాబాద్‍లోని ప్రగతిభవన్‍లో మంత్రులు, కలెక్టర్లు జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈసారి కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉండటంతో పాటు ఆంక్షలతో లాక్‍డౌన్ అమలవుతోంది. దీంతో ఈ ఏడాది కూడా అవతరణ వేడుకలను నిర్వహించకూడదని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. గత ఏడాది మాదిరే ఈ సారి ముఖ్యమంత్రి ప్రగతిభవన్‍లో, మంత్రులు, కలెక్టర్లు జిల్లా కేంద్రాల్లో జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమచారం. దీనిపై ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ఆదేశాలు జారీ చేయనుంది.
2014లో తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‍తో పాటు జిల్లాల్లో అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తమ సేవలు అందించిన శాఖలు, అధికారులు, ఉద్యోగులకు సేవా పురస్కారాలను సైతం అందజేస్తోంది.